అగ్ని సాక్షిగా ,వాయు సౌధంలో ,గాలిని చేదిస్తూ ,భూమి మీద నింగి ,నేల సంగమ స్థలికి ప్రయాణం ప్రారంభించితిని .
ఆకాశ హర్మ్యాలు పేక మేడలుగా ,సరస్సులు చిన్న నీటి కొలనుగా ,వాహనాలు ఆట వస్తువులుగా ,మనుష్యులు మరుగుజ్జులుగా ,పొడవాటి చెట్లు చిన్న మొక్కలుగా వాయు సౌధం నుంచి సుక్ష్మకృతిలో ప్రస్పుటించాయి .(జీవితంలో అనుభవం అనే ఎత్తు ఎదిగినపుడు అన్ని విషయాలు చిన్నవిగా కనిపించినట్లు )
రాత్రి ఈ భూమండలం నిదరోయిన వేళ ,అందరిని కాపు కాసి ,అలసి స్నానమాడ సముద్రములో చేరిన తారాసముహమును వీక్షించితిని .
అతిధిగా ప్రవేశించిన నక్షత్రపు అలసట తగ్గించ ఉద్దేశ్యముతో నిద్దరోమంటూ ఊయల ఊపుటకు ముందుకు వెనుకకు నడయాడుతున్న ఆ అలల ఓంపు సొంపులను కాంచితిని .
మత్సకారుల పడవలు ఒకదానివెనుక మరోకటి ,సంద్రపు జీవులను వలను వేసి పట్టుకొన పయనం సాగిస్తున్న క్షణం ,ఆ పడవల అమరిక సముద్రపు నుదుటిమీద పెట్టుకున్న బొట్టులా నా మదిలో ప్రతిబింబించింది .
యదలో ఎంత సంగర్షణ వున్నా,బయటకు మాత్రం పాల నురగ లాంటి తెల్లని దరహాసంతో అలుపెరగక పయనిస్తూ ,ఒడిదుడుకుల జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలనే పరమార్ధాన్ని సూక్షముగా వ్యక్తికరిస్తున్నఅలల సముహమను చుసితిని .
చెంత చేరిన విహంగములకు ఆతిద్యమే కాక ,ఆనందమొనరింప ఆలలు అన్నీపిల్లగాలితో కలిసి సంగీత కచేరితో కూడిన నృత్య ప్రదర్శన కావించు దృశ్యము మనోహరము .
ఇలా సాగుతున్న ప్రయాణములో ఒక్కసారిగా మానవ నిర్మిత సముద్రపు సౌధాలు ,ఇంద్రుని కొలువులోని అప్సరసులుగా ఒయ్యారమొలుకుతు స్వాగతం పలికినట్లు నిలపడినవి .
స్వాగత సుమాంజలిని స్వీకరించి ,అమ్మ కడుపులోని అమృతాన్ని మధింప నిర్మించిన ఒక కట్టడంలో వసించుటకై వడిగా వాయు సౌధం ముందుకు కదిలి నిర్దారిత ప్రాంగణంలో నిలిచింది .
బాల్కనీ నుంచి చూస్తున్న నాకు ,చుట్టూ నలువైపుల నీళ్ళు,ముంగిట్లో రంగు రంగుల చేపలు,తీయని గాలి,సన్నని నీటి తుంపరలు దివిలోనికి వచ్చిన అనుభూతిని కలిగించాయి
సాయం సంధ్య వేళ నీలపు రంగు ఆకాశపు ఒడిలో,నల్లటి మబ్బుల దుప్పటి కప్పుకుని నిద్దరోడ సన్నద్దమయిన ఆదిత్యుని కాంచి నేత్రానందమయినిది .
భానుని నిష్క్రమణ అనంతరం దట్టమైన చీకటి తెరలు నలుదిక్కుల వ్యాపించగా ఆశా కిరణములు నింప,కోట్ల నక్షత్రాలు వజ్రపు కాంతులీనుతూ ఆకాశములో ప్రత్యక్షమయ్యాయి .
దాహార్తితో వున్న చకోర పక్షి దప్పికను తీర్చ నల్లని మబ్బుల పల్లకీలో నుండి నీలపు లోగిలిలోకి దిగి వెన్నెల కాంతులను బహుమతిగా అందిస్తున్నాడు అందరి ప్రియ చంద్ర మావయ్య .
సమయపు నియతులను దాటి కృత్రిమ ప్రపంచపు ఆనందాలతో ప్రకృతి అందాలనువీక్షించక సమస్యపు వలయంలో తిరుగాడుతున్న ఎంతోమంది భాదాతాప్త హృదయాలకు వుపశాంతిని కల్గించ విసుగొందక ,విరామం లేకుండ పయనిస్తూనే వుంటాయీ పంచభూతాలు
బద్దకంగా ఒంటి మీదున్న నల్లని మబ్బుల దుప్పటిని ప్రక్కకి నెడుతూ ,చీకటి జీవితాలకు వెలుగును ప్రసాదిస్తు దిశ నిర్దేశకం చేయ సూర్య భగవానుడు ప్రచండ తేజస్సుతో సముద్రం నుండి ఫైకి వస్తు,మంత్రోపదేశం చేస్తున్న దక్షిణామూర్తి స్వరూపంగా గోచరించాడు .
ఆ అపార తేజస్సును చూడ ఈ రెండు కనులకు అలవికాక ప్రక్కకు ఒరిగిన నాకు,సూర్య కిరణాల స్పర్స ప్రస్పుటంగా స్పురించి,ఆరోగ్య హేతువయిన విటమిన్ D ని ఉచితముగా అందింప చేశాయి .
అడగకుండా అమ్మయిన పెట్టదంటారు,కాని అడగకనే దేహ పటిష్టతను పెంచే సూర్య భగవానునికి ఏమిచ్చి మనం ఋణం తీర్చుకోగలం .
వెలుగు రేఖలు చీకటి దొంతరులను చీల్చుకొని నలుదిశల వ్యాపించ,ఆకాశంలో తెల్లని పావురం ఉదయపు గాలిని ఆస్వాదింప ,చక్కర్లు కొడుతూ వ్యాయామం చేస్తున్న దృశ్యం శరీర పటుత్వం తగ్గకముందే వ్యాయామం చేయాలనే సందేశాన్ని చెప్పకనే చెపుతుంది .
ఇలా సూర్యోదయ,సుర్యోస్తామయముల నడుమ గడిపిన ఏడు రోజులు తీయని గుర్తుగా హృదయంలో ఎప్పటికి నిలిచి ఉంటాయి .