Friday, August 16, 2013

67 వ స్వాతంత్ర దినోత్స్తవము


  • మహర్షులు ఈ కర్మభూమి ఫై చేసిన తపస్సు ఫలితమా అన్నట్లు నీతి ,న్యాయం ,ధర్మం ,నిజాయితి ,సత్యం అనే పంచేంద్రియాలతో "వేదభూమి " జనియించినది . 
  • నడక ప్రారంభించిన తరుణములో ఋగ్వేద ,యజుర్వేద,సామవేద,అధర్వణ వేదములనెడి  నాలుగు కాళ్ళ ఆసరాతో కదలాడుతూ ప్రపంచాన్ని చూడ ఆరంభించెను . 
  • జీవనాధారమైన గాలి,నింగి,నేల , నీరు,నిప్పు అనెడి పంచభూతములకు అంజలి ఘటిస్తూ ,ఆ ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుకి   "ఆదిత్య హృదయముతో " కృతజ్ఞతలు తెల్పుతూ ఉదయాన్ని ఆరంభించెను . 
  • తన ముంగిట్లో నడయాడిన ఎందరో పుణ్య మూర్తుల గాధలను "రామాయణ ,మహాభారత,భాగవత రూపములొ ప్రతి దినం పటిస్తూ పరవసించిపొయెది . 
  • "తమసోమా జ్యోతిర్గమయ " అని భక్తి భావనలో భగవంతుని ఆరాధిస్తూ తన్మయత్వంతో తనువు ,మనసు పరమాత్మఫై లగ్నం చేసి పులకరించిపోయేది . 
  • "ధర్మో రక్షిత రక్షః "అనే సిద్దాంతములను కట్టుబాటుగా దైనందిన జీవనములో అలవరచుకొని తీరం దాటని ప్రవాహములా నీతివంత జీవనాన్ని కొనసాగించెను . 
  • వర్తక సంబంధాల కోసం తన ఇంటికి వస్తున్న  పరాయి దేశస్తులను "ఆతిథి దేవోభవ " అన్నట్లు సొంత మిత్రులుగా భావించి ఆదరించెను. 
  • విభిన్న సాంప్రదాయాలను,సంస్కృతులను ,ఆచారాలను అగౌరవ పరచక ఆచరించేవారి మనోభావాలు దెబ్బ తినకుండా జాగ్రత్తపడెను . 
  • దేశ భాషలు వేరు అయినా స్నేహభావంతో తన గడ్డఫై కాలుమోపిన "అరబ్భులు,పర్షియన్లు ,పోర్చుగీసు ,గ్రీసు ,బ్రిటిషర్లు ఇలా ప్రతి ఒక్కరికి ఆతిద్యమిచ్చిను   . 
  • కాలం మారి " ఓడలు బండ్లు అయినట్లు " ఆతిద్యమిచ్చిన  మనమే బ్రితిషర్లుకు బానిసలుగా రెండు శతాబ్దాలు బ్రతుకవలసినా ఓర్పుతో సహించింది . 
  • ప్రపంచానికి అహింసావాదంలోని గొప్పతనాన్ని చాటిచెపుతూ బ్రిటిషర్ల చెర నుండి విముక్తి పొంది స్వాతంత్రం పొందినది . 
  • సంపదలు కొల్లగొట్టుకు పోయినా ప్రజలే సంపదలుగా రాజ్యాంగాన్ని స్థాపించి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా అవతరించెను . 
  • కాషాయం -త్యాగానికి ,ఆకుపచ్చ -సస్యశ్యామలకు ,తెలుపు-శాంతికి ,నీలి రంగు అశోకుని చక్రము-ధర్మమునకు నిదర్సనముగా ఈ విలువలు అనే వలువలను ధరించి వినువీధిలో రెపరెపలాడింది  . 
  • గడచిన కాలంలో గర్వముగా చాటిన సందర్భాలు వున్నాయి అలానే గుండెలు చెదరిన సందర్భములు వున్నాయి .. ఈ ఎత్తుపల్లాలను ఆనందముగా స్వీకరించి అలుపెరుగని ప్రయాణము చేస్తూనే వున్నది నా భారతావని .  
అమెరికాని కోలంబస్ కనుగొన్న ఆధారం వుంది కాని ఈ సప్తర్హులు నడయాడిన పుణ్యభూమి ఎప్పుడు ఉద్బవించినదో సాక్షము లేదు .. ఎన్నో తరాల చరిత్ర పునాదులుగా నిర్మితమయిన ఈ జంభుద్వీపం వొంటిఫై రెండు శతాబ్దాల బానిస బ్రతుకు మాత్రం నల్లని మచ్చగా మిగిలి పోయింది . ఈ చెర  నుండి విముక్తి అయి 67 వసంతాలు దాటినా శుభ సందర్భమున అందరికి మనస్పూర్తిగా  స్వాతంత్ర దినోత్స్తవ శుభాకాంక్షలు తెల్పుచున్నాను . 

                                            ........  జై హింద్  ........  

Saturday, May 11, 2013

అమ్మాయి అమ్మ కానుక

  • నీ పురిటి నొప్పుల పరీక్షకు జవాబుగా పుడమిని తాకిన నేను , పరిచయం లేకుండానే నీ స్పర్సతో ప్రశాంతత పొందితిని .
  • భాదనోన్నపుడు , భయభ్రాంతి చెందినపుడు భావ వ్యక్తికరింప అలవికానప్పుడు , చెప్పకనే చెంత చేరి చిట్టి మనసుకు స్వాంతన చేకుర్చితివి . 
  • కొత్త విషయాలు , సరికొత్త ఆట-పాటలతో ఆనందమయ వాతావరణం నెలకొల్ప , నీవే ఒక ఆట వస్తువుల మారి అలరించితివి  . 
  • మారం చేసినపుడు , మొండికేసినపుడు మంచి మాటలు చెప్పి నొప్పించక ఒప్పించి మంచి దారిన నడిపింప ఎల్లపుడు ముందుంటివి  . 
  • అస్వస్తత నొందినపుడు అహర్నిశలు శ్రమించి స్వస్తత చేకూరే వరకు  చిరున్నవుతో చెంతన  చేర్చుకుంటివి . 
  • లక్ష్య సాధనలో అలసిన మనసుకు ఆప్త మిత్రునిలా ఆశ్వాసన చేకూర్చి క్రొంగొత్త ఆశను చిగురింప చేసితివి  . 
  • వేసే ప్రతి అడుగు విజయానికి చేరువయ్యేలా విలువ అయిన సూచనలు ఇస్తూ మార్గదర్శకం చేసితివి  . 
  • గమ్యానికి చేరువయి , నిను విడిచి దూరంగా ఉండవలసి వచ్చినపుడు చెమ్మగిల్లిన కళ్ళతో ఉన్నతిని కాంక్షిస్తూ ఆశీర్వచనము ఇచ్చితివి . 
  • చల్లని ఓదార్పు హస్తంతో , చిరునవ్వుల విరి వానలు పంచే అమ్మ నీవు ఎప్పటికి ఇలానే ఆయురారోగ్యాలతో వుండాలని , ఏ జన్మనైన నీ పాపగా నే పుట్టాలని ప్రార్దిస్తూ HAPPY MOTHER'S DAY . 

Friday, March 29, 2013

చిరునవ్వు

చిరు పెదవుల మాటున దాగిన చైత్రమా
తడి గుండెన ఉషస్సు నింపే మంత్రమా
ఎప్పటికి చెరగనీకుమా 
అదే నీ చిరునవ్వు సుమా !

అమ్మ

  • ప్రేగు బంధము నుండి మొదలయి ,ప్రాణ సమానురాలయి సృష్టికే ప్రతిసృష్టి చేసేదే "అమ్మ "
  •  పరిమళించు తరుణములో శిశువు ఆలపించే తొలి గీతమే  "అమ్మ "
  •  లోకపు సరిహద్దులు ఎరుగని ప్రాయములో తన ఒడిలో ప్రపంచాన్ని ఆవిష్కరించేదే  "అమ్మ"
  •  పసితనపు అజ్ఞాన తిమిరములను జ్ఞాన రేఖతో పారద్రోలి పసిడి కాంతులను విరజిమ్మేల మలిచే తొలి శిక్షకురాలు "అమ్మ "
  •  ఊహల లోకపు దొంతరుల నుండి వాస్తవ లోకంలోకి అడుగిడినపుడు తారసపడే ఆత్మీయ నేస్తం  "అమ్మ "
  •  భానుడి కిరణాలు సోకి హిమము కరుగునట్లు తన చల్లని ఓదార్పుతో బాధాతప్త మనసుకి ఊరట కలిగించేదే  "అమ్మ" 
  •  ఆటుపోటులను ఇముడ్చుకున్న సంద్రంలా కష్టనష్టములు ఓర్చి ఉన్నతులుగా తీర్చిదిద్దేదే  "అమ్మ "
  •  తరాలు మారిన ,యుగాలు గడిచిన ఎప్పటికి వాడని సుగంధ పరిమళమే  "అమ్మ" . 

నిరీక్షణ

ఆనందపు తీరాల ఆచూకీని కనుగొన నిర్దేశించుకున్న లక్ష్యములో
మనోనిబ్బరం వీడక ముందుకు సాగాలన్న వీక్షణలో
అవాంతరాలు దాటి అమృత పానము సేయ క్షణములో
 క్షణమొక యుగమవుతున్నది ఈ నిరీక్షణలో  

Tuesday, March 19, 2013

అరేబియా సముద్ర ప్రయాణము

  • అగ్ని సాక్షిగా  ,వాయు సౌధంలో ,గాలిని చేదిస్తూ ,భూమి మీద నింగి ,నేల సంగమ స్థలికి ప్రయాణం ప్రారంభించితిని .
  • ఆకాశ హర్మ్యాలు పేక మేడలుగా ,సరస్సులు చిన్న నీటి కొలనుగా ,వాహనాలు ఆట వస్తువులుగా ,మనుష్యులు మరుగుజ్జులుగా ,పొడవాటి చెట్లు చిన్న మొక్కలుగా వాయు సౌధం నుంచి సుక్ష్మకృతిలో ప్రస్పుటించాయి .(జీవితంలో అనుభవం అనే ఎత్తు ఎదిగినపుడు అన్ని విషయాలు చిన్నవిగా కనిపించినట్లు )
  • రాత్రి ఈ భూమండలం నిదరోయిన వేళ ,అందరిని కాపు కాసి ,అలసి స్నానమాడ సముద్రములో చేరిన తారాసముహమును వీక్షించితిని . 
  • అతిధిగా ప్రవేశించిన నక్షత్రపు అలసట తగ్గించ ఉద్దేశ్యముతో నిద్దరోమంటూ ఊయల ఊపుటకు ముందుకు వెనుకకు నడయాడుతున్న ఆ అలల ఓంపు సొంపులను కాంచితిని . 
  • మత్సకారుల పడవలు ఒకదానివెనుక మరోకటి ,సంద్రపు జీవులను వలను వేసి పట్టుకొన పయనం సాగిస్తున్న క్షణం ,ఆ పడవల అమరిక సముద్రపు నుదుటిమీద పెట్టుకున్న బొట్టులా నా మదిలో ప్రతిబింబించింది . 
  • యదలో ఎంత సంగర్షణ వున్నా,బయటకు మాత్రం పాల నురగ లాంటి తెల్లని దరహాసంతో అలుపెరగక పయనిస్తూ ,ఒడిదుడుకుల జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలనే పరమార్ధాన్ని సూక్షముగా వ్యక్తికరిస్తున్నఅలల సముహమను చుసితిని  . 
  • చెంత చేరిన విహంగములకు ఆతిద్యమే కాక ,ఆనందమొనరింప ఆలలు అన్నీపిల్లగాలితో కలిసి సంగీత కచేరితో కూడిన నృత్య ప్రదర్శన కావించు దృశ్యము మనోహరము . 
  •  ఇలా సాగుతున్న ప్రయాణములో ఒక్కసారిగా మానవ నిర్మిత సముద్రపు సౌధాలు ,ఇంద్రుని కొలువులోని అప్సరసులుగా ఒయ్యారమొలుకుతు స్వాగతం పలికినట్లు నిలపడినవి . 
  • స్వాగత సుమాంజలిని స్వీకరించి  ,అమ్మ కడుపులోని అమృతాన్ని మధింప నిర్మించిన ఒక కట్టడంలో వసించుటకై వడిగా వాయు సౌధం ముందుకు కదిలి నిర్దారిత ప్రాంగణంలో నిలిచింది . 
  • బాల్కనీ నుంచి చూస్తున్న నాకు ,చుట్టూ నలువైపుల నీళ్ళు,ముంగిట్లో రంగు రంగుల చేపలు,తీయని గాలి,సన్నని నీటి తుంపరలు దివిలోనికి వచ్చిన అనుభూతిని కలిగించాయి 
  • సాయం సంధ్య వేళ నీలపు రంగు ఆకాశపు ఒడిలో,నల్లటి మబ్బుల దుప్పటి కప్పుకుని నిద్దరోడ సన్నద్దమయిన ఆదిత్యుని కాంచి నేత్రానందమయినిది . 
  • భానుని నిష్క్రమణ అనంతరం దట్టమైన చీకటి తెరలు నలుదిక్కుల వ్యాపించగా ఆశా కిరణములు నింప,కోట్ల నక్షత్రాలు వజ్రపు కాంతులీనుతూ ఆకాశములో ప్రత్యక్షమయ్యాయి . 
  • దాహార్తితో వున్న చకోర పక్షి దప్పికను తీర్చ నల్లని మబ్బుల పల్లకీలో నుండి నీలపు లోగిలిలోకి దిగి వెన్నెల కాంతులను బహుమతిగా అందిస్తున్నాడు అందరి ప్రియ చంద్ర మావయ్య . 
  • సమయపు నియతులను దాటి కృత్రిమ ప్రపంచపు ఆనందాలతో ప్రకృతి అందాలనువీక్షించక సమస్యపు వలయంలో తిరుగాడుతున్న ఎంతోమంది భాదాతాప్త హృదయాలకు వుపశాంతిని కల్గించ విసుగొందక ,విరామం లేకుండ పయనిస్తూనే వుంటాయీ పంచభూతాలు 
  • బద్దకంగా ఒంటి మీదున్న నల్లని మబ్బుల దుప్పటిని ప్రక్కకి నెడుతూ ,చీకటి జీవితాలకు వెలుగును ప్రసాదిస్తు దిశ నిర్దేశకం చేయ సూర్య భగవానుడు ప్రచండ తేజస్సుతో సముద్రం నుండి ఫైకి వస్తు,మంత్రోపదేశం చేస్తున్న దక్షిణామూర్తి స్వరూపంగా గోచరించాడు . 
  •  ఆ అపార తేజస్సును చూడ ఈ రెండు కనులకు అలవికాక ప్రక్కకు ఒరిగిన నాకు,సూర్య కిరణాల స్పర్స ప్రస్పుటంగా స్పురించి,ఆరోగ్య హేతువయిన విటమిన్ D ని ఉచితముగా అందింప చేశాయి . 
  • అడగకుండా అమ్మయిన పెట్టదంటారు,కాని అడగకనే దేహ పటిష్టతను పెంచే సూర్య భగవానునికి ఏమిచ్చి మనం ఋణం తీర్చుకోగలం . 
  •  వెలుగు రేఖలు చీకటి దొంతరులను చీల్చుకొని నలుదిశల వ్యాపించ,ఆకాశంలో తెల్లని పావురం ఉదయపు గాలిని ఆస్వాదింప ,చక్కర్లు కొడుతూ వ్యాయామం చేస్తున్న దృశ్యం శరీర పటుత్వం తగ్గకముందే వ్యాయామం చేయాలనే సందేశాన్ని చెప్పకనే చెపుతుంది . 
  • ఇలా సూర్యోదయ,సుర్యోస్తామయముల నడుమ గడిపిన ఏడు రోజులు తీయని గుర్తుగా హృదయంలో ఎప్పటికి నిలిచి ఉంటాయి .