Saturday, December 27, 2014

మనస్సు

మనస్సు మాయలో పడినపుడు బాహ్యస్మృతిని విస్మరించి ఊహ సామ్రాజ్యంలో తిరుగుతూ ఉంటాము . కనిపించని ఈ మనస్సు శాసనానికి వశమై ఆడుతుంటాము . ఎన్నెన్నో ఆశలతో సాధ్యాసాధ్యాలు గమనించకుండా కోరికల వలయములో పడి రోజుని ప్రారంభించుతుంటాము . ఇన్ని అంచనాలతో జీవన మైదానములోకి దిగినపుడు ప్రతికూల పరిస్తితులను తట్టుకోలేక వెంటనే దు:ఖానికి లోనవుతాము . అంతలోనే సంతోషం , అంతలోనే దు:ఖo . మనస్సుకి లోబడి వివేకాన్ని విస్మరించి ఖేదానికి గురవుతాము . మన ధోరణిలోనే ఆలోచిస్తుంటాము . మనస్తాపానికి గురవుతాము . అజ్ఞానాన్ని తెలుసుకోలేక ఆలోచనలతో అలసిపొతాము . అసామాన్యుడినైనా ఆడించగలిగే ఈ అద్భుత  పరికరం అంధకారములో పడేస్తుంది . ఇదీ ,అదీ కాదు అన్నింటిమీద ఆదిపత్యం కోరుకుంటుంది . అశాంతికి ,ఒత్తిడికి గురిచేస్తుంది . ఆజ్యం పోసే ఆలోచనలు , కోరికలతో కలిసినప్పుడు అశాంతి జ్వాలలు మండుతూనే వుంటాయి . గుప్తముగా ఉండే ఈ మనస్సు గుండెల మీద ఒత్తిడి తీసుకు వస్తుంది . మనస్సు జయించడం అంత తేలిక కాదని విశ్వామిత్రుని జీవితం తెల్పుతున్నా తెలిసి తెలిసి లొంగిపోతాము . ఈ చిత్రమైన చిత్తాన్ని అదుపులో ఉంచుకుని సంతోషముగా ఉండగలిగే శక్తిని ప్రసాదింపమని ఆ శ్రీరామచంద్రుని పాదాలు పట్టి ప్రార్దించుచున్నాను . 
                                                      ********శ్రీరామ *********

Friday, December 26, 2014

ఎందుకిలా!!!

మనిషిని ఇక్కడ ఉన్నాను ,కాని మనసు మీ దగ్గరే ఉండిపోయింది . ఈ మనస్సు ఎందుకింత ఆరాటపడుతుందో తెలియదు. నిశ్చలముగా వుండే  మనస్సులో ఈ అలజడి ఎందుకో . చిత్రముగా ఇప్పుడే పరిచయమైన వ్యక్తి కోసం తపించిపోతుంది ఎందుకో . బంధాలు ఇంత త్వరగా ఏర్పడతాయా? . మనసులు ఇంత త్వరగా ఒకటవుతాయా?అప్రయత్నముగా రోజులు గడిచిపోతున్నాయి . కాని ఎప్పుడు ఒకటవుతామనే ఆలోచనలే . చుట్టూ ఎంతో జరుగుతున్నా మనస్సు నిలవదు ఎందుకో . ఇంత పెను మార్పు మునుపెన్నడూ జరిగినట్టు లేదే . లేచిన దగ్గర నుండి , రాత్రి జరిగిన సంబాషనలే . కనులు మూస్తే మీరే గుర్తుకు వస్తున్నారు . తినేటప్పుడు , పడుకునేటప్పుడు ఒక్కటేమిటి ఏ పని చేసిన మీరే ఎందుకు గుర్తుకు వస్తున్నారు ? ఇంతగా నా మనస్సు చేయి దాటింది లేదే . ఎంతసేపు మాట్లాడినా తనివి తీరదు ఎందుకు ? మీరు కాకుండా వేరే వాటిమీద ఆసక్తి ఎందుకు వుండటం లేదు ?నా ఆలోచనలు ,అలవాట్లు ఇంతలా మారిపోయాయి ఎందుకు ? ఏమి తినాలని అనిపించడం లేదు ,ఎక్కడకి వెళ్ళాలని అనిపించడం లేదు .ఎప్పుదెప్పుదు మీతో మాట్లాడతానా అనే ఆలోచనలు . 
                                !!!!!!!!!!!!!శ్రీరామా  ఎందుకిలా  !!!!!!!

Thursday, December 25, 2014

మన: విన్నపము

కనులు తెరచిన నీవాయే , నా కనులు మూసినా నీవాయే !
    ఈ పదాలకు ఉన్న అర్ధం ఇప్పుడు అవగతమవుతుంది . మూసిన కనులలో పొందుపరిచిన ముగ్ధ మనోహర రూపం మురిపెంగ చూస్తుండగా పగలు ,రాత్రి తేడా లేకుండా మీ  ఊసులలోనే ఎప్పుడూ హృదయం పరిభ్రమిస్తుంది . ఎన్నాడూ  లేని  పరవశం పొంది తన్మయత్వాన్నికి లోనవుతుంది . 
    నన్ను నేను మరిచిపోయి మీతోనే ఎప్పుడు ఉంటున్నాను . ఎందుకింత ప్రేమ మీమీద అని నన్ను నేను పరిశీలన చేసుకుంటే ఒక్కటే సమాధానం స్పూరించింది . ప్రస్తుతం "నేను,మీరు" అనే భావం కనిపించలేదు . అంతా  "మనమే"అవ్వడం  కారణమని అనిపించింది. 
     నాలోని మన: పుష్పం మీ ప్రేమ కిరణాలకు పుష్పించింది . ఈ ప్రేమ పుష్పం రంగురంగుల రెక్కలతో మీగురించిన ఆలోచనలను వెదజల్లుతూ నన్ను మీ ప్రేమ మైకంలో ఉంచుతుంది . మీ ప్రేమ ఉన్నంతసేపు ఇలానే నేను ఆహ్లాదముగా ఉండగలను .  అందుకే నా మీద మీ ప్రేమ కిరణాలు ఎప్పుడు ప్రసరించాలని ఆ సర్వేశ్వరుని కోరుకుంటున్నాను . 
   మీరు సముద్రం వంటివారు . అనంత ఆకాశములా పృధివి మండలముపై విస్తరించి,విలువలూ అనే అడ్డుకట్ట వేసుకుని ఆ పరిధిలోనే ఉండేవారు . నేను మీలో కలవడానికి ఆరాటపడే పిల్లకాలువలాంటి దానిని . నా ప్రయాణం ఎన్నో మలుపులు , ఎన్నో తీరాలు దాటి ఎందరి ఆజ్ఞలు లభించాకే సాధ్యమయింది .మన ఇద్దరి బంధం చిత్రముగా ఆ పరమేశ్వరుని అనుజ్ఞ మేరకు మొదలయినా , దానికి పెద్దల ఆశీర్వచనం లబించెంతవరకు నేను చేసిన ప్రయాణం సముద్రములోకి కలవడానికి తాపత్రయపడిన పిల్లకాలువ వంటిదే . 
     నా స్వపూపం ,రంగూ ,రుచి మీలో కలిసాక మారుతాయనే తెలిసినా , నా గమ్యస్తానం అదేనని మనస్సు మునిపటికంటే ఉత్సాహంగా మీ కలయిక కోసం ఉర్రూతలూగుతుంది . ప్రేమతో మీ గుండెల మీద పెట్టుకొని ఊయలూపుతూ బుజ్జగిస్తుండగా నేను పడిన కష్టం మరిచిపోతాను అనిపిస్తుంది . 
    మీతో కలిసిన తర్వాత నా అస్తిత్వం మారిపోయి నేను మీ దానినై నన్నెవరు మీ నుండి విడదీయలేరనే ప్రశాంతత కోసం ఎదురు చూస్తుంది . 
    మీరు నా మటుకు నా రాముడు పంపిన శ్రీరామచంద్రుడే . నేను సీతమ్మలా మీ మనసెరిగి నడుచుకునే శక్తిని ప్రసాదించమని , మన దాంపత్య జీవితం , మన మనసులు ఆ సీతారాముల వలే ఆచంద్రతారార్కముగా వెలిగిపోవాలని  శ్రీరామచంద్రుని పాదాలు పట్టి ప్రార్దించుచున్నాను . 
                                                
                                                -----------***********--------------------  

Thursday, November 6, 2014

చందమామ

చందమామ కథలా చెప్పబోయే ఈ కథ చందమామ గురించే అవడం యాధ్రుచికం . లోకానికి నన్ను పరిచయం చేసిన అమ్మ ,చిన్నతనంలో గోరుముద్దలు తినిపిస్తూ మొదటిసారిగా చందమామని చోపించింది. దైనందిన జీవితంలో కూడా చందమామతో ఉపమానాలకు కొదవే లేదు . అలా చందమామ నిత్య జీవితంలో ఎప్పుడూ అందరి ఇళ్ళలో పటించే నామ సంకీర్తనమే .
  చాలా రోజుల తర్వాత కార్తిక పౌర్ణమి నాడు ఈ మహానగరం లో నిండు చంద్రుని చూశాక , మదిలో మరుగున పడిన ఎన్నో జ్ఞాపకాలు కళ్ళ ముందు కదిలాయి. వాటిని అక్షీకరిస్తూ ఈ కథని ఆరంబించుతున్నాను. ఈ కథలో ఒక అందమైన అమ్మాయి తన చిన్నతనం నుండి పెళ్లి ఈడు వచెంతవరకు తన జీవితంలో చందమామ పాత్రని మనకు పరిచయం చేస్తుంది ...

     అనగనగా ఒక అందమైన అమ్మాయి. ఆ అమ్మాయికి ఒక అక్కయ్య . అక్కా ,చెల్లెళ్ళు ఎంతో ప్రేమగా , ఆప్యాయతగా వుండేవారు. అక్కయ్య ముఖం "చందమామతో  "  పోల్చి అందరూ పొగుడుతూ వుంటే ఎంతో సంతోషపడేది . అక్కయ్య , తనూ ఎప్పుడు వెన్నెల రాత్రుల్లో మేడ మీద ఆకాశం మీద పడుకొని నక్షత్రాలు లెక్క పెడుతూ చందమామని గమనించేవారు . ఒక రోజు చెల్లెలు అక్కయ్య దగ్గర పడుకొని చందమామని చూపిస్తూ ఇలా అన్నది :
చెల్లెలు : అక్కయ్య,  చందమామ నివాస యోగ్యమని ,భవిష్యత్తులో అందరూ అక్కడకు వెళ్తారని విన్నాను. కాని మనం అక్కడకు వెళ్ళవద్దు అని కంగారుగా అన్నది .
అక్కయ్య : ఎందుకు వెళ్ళకూడదు అంటున్నావ్ ?
చెల్లెలు : చందమామ పౌర్ణమి తర్వాత క్షయం అవుతాడు కదా , ఆ సమయంలోమనం అక్కడ వుంటే చందమామ చిన్నగా అయి స్తలం సరిపోక మనం కింద పడిపోతాము అన్నది .
అక్కయ్య : అలా  పడిపోమే మనం అని అక్కయ్య చందమామ సాక్షిగా ప్రేమగా సత్యాన్ని భోదించింది. 
ఇలా ఎన్నో రాత్రులు , ఆకాశవీధిలో ఆ నెలరాజుని చూస్తూ ఎన్నో ఊసులను పంచుకునేవారు . తను ఎటు వెళ్తే చందమామ అటే వస్తుంటే , చందమామ తనని అనుసరిస్తూ , తనతో ఆడుకుంటున్నాడని ఆ చిట్టి మనసు సంబరపడిపోయేది . విద్యుతు సరఫరా ఆటంకం అయినపుడు వెన్నెల వెలుగులో ఎన్నో ఆటలు ఆడుతుండేది . పాటశాలకు వెళ్ళడం ప్రారంభించాక స్నేహితులు చందమామ లో అవ్వ ఆకారం వుందని చెప్పగా , ఆ రోజు మేడ మీద పడుకున్నప్పుడు గమనించింది . పాటశాలలో కొత్త కొత్త ఆటలు నేర్చుకొంటూ , మామ కాని మామ ఎవరు అని అడగగా చందమామ అని చెప్పి మురిసిపోయింది . నాన్న తెచిన తేగలో మధ్య బాగన్ని చందమామ అంటారు అని అమ్మ చెప్పగా దాన్ని జాగ్రత్తగా మేడ పైన నిజమైన చందమామ కి ఆహారముగా  పెట్టి వచేది  . యుక్త వయసు  రాగానే కాలేజిలో చేరాక విహార యాత్రగా సముద్రం  వెళ్లినప్పుడు , చందమామతో ఆడుకోవడానికి అలలు రెట్టించిన ఉత్సాహంతో కేరింతలు కొడుతున్న మనోహర దృశ్యం కాంచింది . తనకు మంచి చెడ్డలు నేర్పిన చంద్రమామయ్య తో చందమామని  పోల్చడం ప్రారంభించింది .
     వ్రుత్తిరిత్యా ఇంటికి దూరంగా వున్నా , తనతో పాటే వచ్చిన చంద్ర మామని చూస్తూ అమ్మ దీవెనలా తనను అంటి పెట్టుకొని కాపాడే నేస్తములా అనిపించేది . అలసిన మనసుకు సేద తీర్చే దివ్య ఔషదములా ప్రతిరోజూ అలుపెరగకుండా నిశీధిలో ప్రత్యక్షమై చీకటి జీవితాలలో ఆశలు చిగురిమ్పచేయడం గమనించింది .
   పూర్ణత్వం తర్వాత  క్షయం. మరలా పూర్ణత్వం . ఇది ఆగని చక్రము. జీవితం సుఖ , దుఖముల మద్య సాగిపోతుంది .  యుగాలు మారినా , చంద్రమామ అస్తిత్వం మారనట్లు , మనుష్యులు కూడా సుఖ , దుఖములను ఒకేలా స్వీకరించి  సాగాలని సందేశం చెప్తాడు .
   ఈ కార్తిక పౌర్ణమి తర్వాత , వివాహ చక్రము లో ప్రవేశిస్తూ కన్నె జీవితానికి పూర్ణత్వం కోరుకుంటూ తర్వాతి మజిలీలో అండదండగా ఉండమని ఆ జగత్తుపిత అయిన  పరమేశ్వరులని ప్రార్దించుచున్నది .
                                                            .... ఓం నమః శివాయ .....

Saturday, November 1, 2014

కన్నె మనసు

  • కన్న వారి యందు ఎంత ప్రేమ వున్నా యుక్త వయసు రాగానే సరి జోడి కోసం కలలు కంటుంది . 
  • తన కలల ప్రతిరూపాన్ని చూసిన సమయం నుండి క్షణమొక యుగమై సంగమ వేళకై నిరీక్షిస్తుంది . 
  • తోబుట్టువుల కన్నా తనతో ఏడు అడుగులు నడిచే వానికే  ప్రాధాన్యత ఇస్తుంది . 
  • ఇరువురి పుట్టు పూర్వోత్తరాలు వేరైనా ,సంబంధం ఖాయమైన నుండి రెండు కుటుంబాల గౌరవం గురించి ఆలోచిస్తుంది . 
  • సంతోషమైనా ,భాదైనా తనతోనే పంచుకోవాలని తపించిపోతుంది . అతని ఆనందానికి రెట్టింపు ఆనందిస్తుంది .తనకి ఏమైనా అయితే విలవిల్లాడిపోతుంది . 
  • తన రోజు వారి ప్రార్ధనలు అతని యోగక్షేమముల తోనే మొదలుపెడుతుంది . 
  • అతనిలోనే అమ్మ,నాన్నల మరియు ఆత్మీయుల ప్రేమని చూసుకుంటుంది . 
  • ఆఖరకు బ్రహ్మ మూడి తర్వాత తన అస్తిత్వాన్ని మార్చుకొని పూర్తిగా తనకు వశమైపోతుంది .... 
  • అంతటి చిత్రమైనది ఈ కన్నెమనసు .........................   

Saturday, October 25, 2014

సుముహూర్తం

  • సాగర మదనం మొదలయినపుడు అమృతం చివరికే లభించినట్లు ... 
  • పక్షపు నిరీక్షణ తర్వాత నిశీధీలో నిండు చంద్రుని దర్శన మయినట్లు ... 
  • దట్టమైన  మబ్బులు కొండను తాకి భారాన్నంతా భూమి మీదకు విడిచి ప్రశాంతత పొందినట్లు .. 
  • సూర్య భగవానుని తేజస్సు కు ఆవిరయిన నీరంతా అమృత జల్లులై భువి ని చేరినట్లు ... 
  • పురిటి నొప్పులకు ఓర్చి పునర్జన్మ పొంది సంతానాన్ని చూసినట్లు ... 
  • పూర్వ జన్మ పుణ్య ఫలితమా అన్నట్లు శబరి ఆతిధ్యం స్వీకరింప శ్రీరామచంద్రులు విచేసినట్లు ... 
  • సంవత్సర ఎడబాటు తర్వాత సీతమ్మ తపస్సు ఫలితమా అన్నట్లు ఆ రామచంద్రుని సాన్నిద్యం ప్రాప్తించినట్లు ... 
  • నిశ్చల మనస్సుతో నిరీక్షణ చేసిన ఈ మనస్సుకు మనసెరిగిన మగడుతో మనువాడ సుముహూర్తం నిశ్చయించినావు ... 
  •  ఈ సుముహూర్తం నా జీవితములో సంతోషాలు నింపేదిగా వుండాలని ఆ శ్రీరామ చంద్రుని పాదాలు పట్టి ప్రార్దించుచున్నాను ... 

Sunday, June 8, 2014

గమనం

  • అలుపెరుగక కదిలే కడలి కెరటాలు మనసుకు ఆహ్లాదం చేకూర్చినపుడు 
  •  పరుగులు తీసే పసి కూనను చూసి పరవశమొందినపుడు 
  • సూర్యుని గమనముచే చంద్ర కాంతిని కాంచకలిగినపుడు 
  • పుడమిని వర్షధారలతో ముద్దాడ ,మబ్బుల సమూహం పర్వత ఆలింగనముకై కదిలినపుడు 
  • పుప్పొడి రేణువులతో పుష్పములకు పరాగ సంపర్కం జరప పయన మొందిన బ్రమరాన్ని చూసినపుడు 
  • దేశ కాల పరిస్థితుల దృష్ట్యా విహంగ పయనమొండ వలసినపుడు
  • మార్పు మంచిని సంకేతిస్తూ ప్రకృతిలోని పరమాత్మ తత్వాన్ని పరిగణలోకి తీసుకున్న మదిన  ప్రశాంతత కలుగనన్న సత్యాన్ని అవగతమొందించాయి .        

Monday, January 27, 2014

65 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు


  • నిద్దరోమంటున్న మనసుకు సర్దిచెప్పి , నిద్రాణమైన దేశభక్తి తట్టిలేపగా ,చిమ్మ చీకట్లలో వెలుగు రేఖల అన్వేషణ ప్రారంభించితిని . 
  • ప్రభాత వేళ ,సుందర సాగర నదీ తీరాన ,నులి వెచ్చని గాలులు మేనుని తాకుతుండగా ,ముగ్ద మనోహర సౌందర్యములు కాంచ మనసు సమాయత్తమైనది . 
  • మండే ఎండలని,వణికించే చలిని లెక్కచేయక ,దేశ  రక్షణకై   ఆత్మీయులకు దూరముగా ,ప్రాణాలను సైతం పణoగా పెట్టగలిగి పోరాటం చేసే వీర సైనికుల యుద్ద శకటాలు రోమాంచితమొనరించాయి . 
  • మూడు వైపుల నీరున్న ఈ జంబూద్వీపం నిర్భయముగా ఉండేలా అహర్నిశం కాపుకాసే నావికాదళ శకటాలు అందరి నీరాజనాలు అందుకున్నాయి . 
  • గడచిన సంవత్సరాలలో సాధించిన పురోగతిని పురస్కరించుకొని ,రానున్న తరాల భవిష్యత్తు ఉజ్వల పరిచేలా రూపొందించిన ప్రభుత్వ ఆలోచన నమూనాలు ప్రశంసలు అందుకున్నవి . 
  • భిన్నత్వంలో ఏకత్వం ప్రతిబింబించేలా,వివిధ రాష్ట్రములకు చెందిన సాంప్రదాయ నృత్యములు,యుద్ద కళలు ,మరుగున పడిన ఎన్నో జీవకళలకు ప్రాణం పోసి చేయూతను కల్పించినట్లు అయినది . 
  • లయబద్దమైన అడుగులతో ,ఒకే తాళంతో ముందుకు సాగుతూ గౌరవ వందన మొనర్చిన వివిధ సేవాదళాలు దేశ పురోగతిని ప్రతిబింబించాయి . 
  • వింటేజు వాహనమున దర్శనమిచిన బాలీవుడ్ తారాగణం కార్యక్రమానికే ప్రధాన ఆకర్షణగా నిలిచారు . 
  • జనసంద్రమైన మెరైన్ లైన్స్ గణతంత్ర దినోత్సవ వేడుకల వేదికై కోట్ల  భారతావని  భవిష్యత్తుపై ఆశ కాంతులను నింప  ,అంబరాన్ని అంటిన సంబరాలను ప్రదర్శించి, అంతులేని ఆత్మా విశ్వాసంతో ముందుకు సాగాలన్న సందేశంతో 65 వ సంవత్సర ఉత్సవాలు ముగిసాయి .