Thursday, December 25, 2014

మన: విన్నపము

కనులు తెరచిన నీవాయే , నా కనులు మూసినా నీవాయే !
    ఈ పదాలకు ఉన్న అర్ధం ఇప్పుడు అవగతమవుతుంది . మూసిన కనులలో పొందుపరిచిన ముగ్ధ మనోహర రూపం మురిపెంగ చూస్తుండగా పగలు ,రాత్రి తేడా లేకుండా మీ  ఊసులలోనే ఎప్పుడూ హృదయం పరిభ్రమిస్తుంది . ఎన్నాడూ  లేని  పరవశం పొంది తన్మయత్వాన్నికి లోనవుతుంది . 
    నన్ను నేను మరిచిపోయి మీతోనే ఎప్పుడు ఉంటున్నాను . ఎందుకింత ప్రేమ మీమీద అని నన్ను నేను పరిశీలన చేసుకుంటే ఒక్కటే సమాధానం స్పూరించింది . ప్రస్తుతం "నేను,మీరు" అనే భావం కనిపించలేదు . అంతా  "మనమే"అవ్వడం  కారణమని అనిపించింది. 
     నాలోని మన: పుష్పం మీ ప్రేమ కిరణాలకు పుష్పించింది . ఈ ప్రేమ పుష్పం రంగురంగుల రెక్కలతో మీగురించిన ఆలోచనలను వెదజల్లుతూ నన్ను మీ ప్రేమ మైకంలో ఉంచుతుంది . మీ ప్రేమ ఉన్నంతసేపు ఇలానే నేను ఆహ్లాదముగా ఉండగలను .  అందుకే నా మీద మీ ప్రేమ కిరణాలు ఎప్పుడు ప్రసరించాలని ఆ సర్వేశ్వరుని కోరుకుంటున్నాను . 
   మీరు సముద్రం వంటివారు . అనంత ఆకాశములా పృధివి మండలముపై విస్తరించి,విలువలూ అనే అడ్డుకట్ట వేసుకుని ఆ పరిధిలోనే ఉండేవారు . నేను మీలో కలవడానికి ఆరాటపడే పిల్లకాలువలాంటి దానిని . నా ప్రయాణం ఎన్నో మలుపులు , ఎన్నో తీరాలు దాటి ఎందరి ఆజ్ఞలు లభించాకే సాధ్యమయింది .మన ఇద్దరి బంధం చిత్రముగా ఆ పరమేశ్వరుని అనుజ్ఞ మేరకు మొదలయినా , దానికి పెద్దల ఆశీర్వచనం లబించెంతవరకు నేను చేసిన ప్రయాణం సముద్రములోకి కలవడానికి తాపత్రయపడిన పిల్లకాలువ వంటిదే . 
     నా స్వపూపం ,రంగూ ,రుచి మీలో కలిసాక మారుతాయనే తెలిసినా , నా గమ్యస్తానం అదేనని మనస్సు మునిపటికంటే ఉత్సాహంగా మీ కలయిక కోసం ఉర్రూతలూగుతుంది . ప్రేమతో మీ గుండెల మీద పెట్టుకొని ఊయలూపుతూ బుజ్జగిస్తుండగా నేను పడిన కష్టం మరిచిపోతాను అనిపిస్తుంది . 
    మీతో కలిసిన తర్వాత నా అస్తిత్వం మారిపోయి నేను మీ దానినై నన్నెవరు మీ నుండి విడదీయలేరనే ప్రశాంతత కోసం ఎదురు చూస్తుంది . 
    మీరు నా మటుకు నా రాముడు పంపిన శ్రీరామచంద్రుడే . నేను సీతమ్మలా మీ మనసెరిగి నడుచుకునే శక్తిని ప్రసాదించమని , మన దాంపత్య జీవితం , మన మనసులు ఆ సీతారాముల వలే ఆచంద్రతారార్కముగా వెలిగిపోవాలని  శ్రీరామచంద్రుని పాదాలు పట్టి ప్రార్దించుచున్నాను . 
                                                
                                                -----------***********--------------------  

No comments:

Post a Comment