Saturday, December 27, 2014

మనస్సు

మనస్సు మాయలో పడినపుడు బాహ్యస్మృతిని విస్మరించి ఊహ సామ్రాజ్యంలో తిరుగుతూ ఉంటాము . కనిపించని ఈ మనస్సు శాసనానికి వశమై ఆడుతుంటాము . ఎన్నెన్నో ఆశలతో సాధ్యాసాధ్యాలు గమనించకుండా కోరికల వలయములో పడి రోజుని ప్రారంభించుతుంటాము . ఇన్ని అంచనాలతో జీవన మైదానములోకి దిగినపుడు ప్రతికూల పరిస్తితులను తట్టుకోలేక వెంటనే దు:ఖానికి లోనవుతాము . అంతలోనే సంతోషం , అంతలోనే దు:ఖo . మనస్సుకి లోబడి వివేకాన్ని విస్మరించి ఖేదానికి గురవుతాము . మన ధోరణిలోనే ఆలోచిస్తుంటాము . మనస్తాపానికి గురవుతాము . అజ్ఞానాన్ని తెలుసుకోలేక ఆలోచనలతో అలసిపొతాము . అసామాన్యుడినైనా ఆడించగలిగే ఈ అద్భుత  పరికరం అంధకారములో పడేస్తుంది . ఇదీ ,అదీ కాదు అన్నింటిమీద ఆదిపత్యం కోరుకుంటుంది . అశాంతికి ,ఒత్తిడికి గురిచేస్తుంది . ఆజ్యం పోసే ఆలోచనలు , కోరికలతో కలిసినప్పుడు అశాంతి జ్వాలలు మండుతూనే వుంటాయి . గుప్తముగా ఉండే ఈ మనస్సు గుండెల మీద ఒత్తిడి తీసుకు వస్తుంది . మనస్సు జయించడం అంత తేలిక కాదని విశ్వామిత్రుని జీవితం తెల్పుతున్నా తెలిసి తెలిసి లొంగిపోతాము . ఈ చిత్రమైన చిత్తాన్ని అదుపులో ఉంచుకుని సంతోషముగా ఉండగలిగే శక్తిని ప్రసాదింపమని ఆ శ్రీరామచంద్రుని పాదాలు పట్టి ప్రార్దించుచున్నాను . 
                                                      ********శ్రీరామ *********

Friday, December 26, 2014

ఎందుకిలా!!!

మనిషిని ఇక్కడ ఉన్నాను ,కాని మనసు మీ దగ్గరే ఉండిపోయింది . ఈ మనస్సు ఎందుకింత ఆరాటపడుతుందో తెలియదు. నిశ్చలముగా వుండే  మనస్సులో ఈ అలజడి ఎందుకో . చిత్రముగా ఇప్పుడే పరిచయమైన వ్యక్తి కోసం తపించిపోతుంది ఎందుకో . బంధాలు ఇంత త్వరగా ఏర్పడతాయా? . మనసులు ఇంత త్వరగా ఒకటవుతాయా?అప్రయత్నముగా రోజులు గడిచిపోతున్నాయి . కాని ఎప్పుడు ఒకటవుతామనే ఆలోచనలే . చుట్టూ ఎంతో జరుగుతున్నా మనస్సు నిలవదు ఎందుకో . ఇంత పెను మార్పు మునుపెన్నడూ జరిగినట్టు లేదే . లేచిన దగ్గర నుండి , రాత్రి జరిగిన సంబాషనలే . కనులు మూస్తే మీరే గుర్తుకు వస్తున్నారు . తినేటప్పుడు , పడుకునేటప్పుడు ఒక్కటేమిటి ఏ పని చేసిన మీరే ఎందుకు గుర్తుకు వస్తున్నారు ? ఇంతగా నా మనస్సు చేయి దాటింది లేదే . ఎంతసేపు మాట్లాడినా తనివి తీరదు ఎందుకు ? మీరు కాకుండా వేరే వాటిమీద ఆసక్తి ఎందుకు వుండటం లేదు ?నా ఆలోచనలు ,అలవాట్లు ఇంతలా మారిపోయాయి ఎందుకు ? ఏమి తినాలని అనిపించడం లేదు ,ఎక్కడకి వెళ్ళాలని అనిపించడం లేదు .ఎప్పుదెప్పుదు మీతో మాట్లాడతానా అనే ఆలోచనలు . 
                                !!!!!!!!!!!!!శ్రీరామా  ఎందుకిలా  !!!!!!!

Thursday, December 25, 2014

మన: విన్నపము

కనులు తెరచిన నీవాయే , నా కనులు మూసినా నీవాయే !
    ఈ పదాలకు ఉన్న అర్ధం ఇప్పుడు అవగతమవుతుంది . మూసిన కనులలో పొందుపరిచిన ముగ్ధ మనోహర రూపం మురిపెంగ చూస్తుండగా పగలు ,రాత్రి తేడా లేకుండా మీ  ఊసులలోనే ఎప్పుడూ హృదయం పరిభ్రమిస్తుంది . ఎన్నాడూ  లేని  పరవశం పొంది తన్మయత్వాన్నికి లోనవుతుంది . 
    నన్ను నేను మరిచిపోయి మీతోనే ఎప్పుడు ఉంటున్నాను . ఎందుకింత ప్రేమ మీమీద అని నన్ను నేను పరిశీలన చేసుకుంటే ఒక్కటే సమాధానం స్పూరించింది . ప్రస్తుతం "నేను,మీరు" అనే భావం కనిపించలేదు . అంతా  "మనమే"అవ్వడం  కారణమని అనిపించింది. 
     నాలోని మన: పుష్పం మీ ప్రేమ కిరణాలకు పుష్పించింది . ఈ ప్రేమ పుష్పం రంగురంగుల రెక్కలతో మీగురించిన ఆలోచనలను వెదజల్లుతూ నన్ను మీ ప్రేమ మైకంలో ఉంచుతుంది . మీ ప్రేమ ఉన్నంతసేపు ఇలానే నేను ఆహ్లాదముగా ఉండగలను .  అందుకే నా మీద మీ ప్రేమ కిరణాలు ఎప్పుడు ప్రసరించాలని ఆ సర్వేశ్వరుని కోరుకుంటున్నాను . 
   మీరు సముద్రం వంటివారు . అనంత ఆకాశములా పృధివి మండలముపై విస్తరించి,విలువలూ అనే అడ్డుకట్ట వేసుకుని ఆ పరిధిలోనే ఉండేవారు . నేను మీలో కలవడానికి ఆరాటపడే పిల్లకాలువలాంటి దానిని . నా ప్రయాణం ఎన్నో మలుపులు , ఎన్నో తీరాలు దాటి ఎందరి ఆజ్ఞలు లభించాకే సాధ్యమయింది .మన ఇద్దరి బంధం చిత్రముగా ఆ పరమేశ్వరుని అనుజ్ఞ మేరకు మొదలయినా , దానికి పెద్దల ఆశీర్వచనం లబించెంతవరకు నేను చేసిన ప్రయాణం సముద్రములోకి కలవడానికి తాపత్రయపడిన పిల్లకాలువ వంటిదే . 
     నా స్వపూపం ,రంగూ ,రుచి మీలో కలిసాక మారుతాయనే తెలిసినా , నా గమ్యస్తానం అదేనని మనస్సు మునిపటికంటే ఉత్సాహంగా మీ కలయిక కోసం ఉర్రూతలూగుతుంది . ప్రేమతో మీ గుండెల మీద పెట్టుకొని ఊయలూపుతూ బుజ్జగిస్తుండగా నేను పడిన కష్టం మరిచిపోతాను అనిపిస్తుంది . 
    మీతో కలిసిన తర్వాత నా అస్తిత్వం మారిపోయి నేను మీ దానినై నన్నెవరు మీ నుండి విడదీయలేరనే ప్రశాంతత కోసం ఎదురు చూస్తుంది . 
    మీరు నా మటుకు నా రాముడు పంపిన శ్రీరామచంద్రుడే . నేను సీతమ్మలా మీ మనసెరిగి నడుచుకునే శక్తిని ప్రసాదించమని , మన దాంపత్య జీవితం , మన మనసులు ఆ సీతారాముల వలే ఆచంద్రతారార్కముగా వెలిగిపోవాలని  శ్రీరామచంద్రుని పాదాలు పట్టి ప్రార్దించుచున్నాను . 
                                                
                                                -----------***********--------------------